సినిమాపేరు : కృష్ణం వన్డే జాగ్తగురుమ్ || సంగీత దర్శకుడు : మని శర్మ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : ఎస్.పీ బాలసుబ్రమణ్యం
పల్లవి:
జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం
పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం
నిత్యజీవన సత్యమని భాగవతలీలల అంతరార్థం
జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం
చెలియలికట్టను తెంచుకుని విలయము విజృంభించునని
ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతం ఎదురై ముంచునని
సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టిరక్షణకు చేయూతనిచ్చి
నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం
చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే
పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే
బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని
ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగరమధన మర్మం
చరణం1
ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలుపగనురికే ఉన్మాదమ్మును కరాళ దంష్ట్రుల కుళ్ళగించి
ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోద్ధతి రణ హుంకారం..
ఆదివరాహపు ఆకారం
ఏదీ ఎక్కడరా నీ హరి దాక్కున్నాడేరా భయపడి
బయటకి రమ్మను రా ఎదుటపడి నన్ను గెలవగలడా తలపడి
నువ్ నిలిచిన ఈ నేలని అడుగు ఈ నాడుల జీవజలమ్ముని అడుగు
నీ నెత్తుటి వెచ్చదనాన్ని అడుగు నీ ఊపిరిలో గాలిని అడుగు
నీ అడుగుల ఆకాశాన్నడుగు నీలో నరుని హరిని కలుపు
నీవే నరహరివని నువ్ తెలుపు
ఉన్మత్త మాతంగ భంగి ఘాతుక వితతి
హంతృ సంఘాత నిర్ఘ్రుణ నిబడమే జగతి
అఘము నగమై ఎదిగే అవనికిదే అశనిహతి
ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి
శితమస్తి హతమస్తకారి నఖ సమకాశియో
క్రూరాసి క్రోసి హుతదాయ దంష్ట్రుల ద్రోసి మసిజేయ మహిత యజ్ఞం
అమేయం అనూహ్యం అనంతవిశ్వం
ఆ బ్రహ్మాండపు సూక్ష్మస్వరూపం ఈ మానుష రూపం
కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం
ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం
జరుగుతున్నది జగన్నాటకం.. జగ జగ జగ జగ జగన్నాటకం
జరుగుతున్నది జగన్నాటకం.. జగ జగ జగ జగమే నాటకం
పాపపుతరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుగక
పరశురాముడై భయదభీముడై పరశురాముడై భయదభీముడై
ధర్మాగ్రహవిగ్రహుడై నిలచిన శోత్రియ క్షత్రియతత్వమే భార్గవుడు
చరణం2
ఏ మహిమలూ లేక ఏ మాయలూ లేక
నమ్మశక్యముగాని ఏ మర్మమూ లేక
మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహితచరితగ మహిని
మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచి
ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్నపరిచితునిగా
దర్శింపచేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యా వరణతరణము
అనిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా ఈశత్వమ్ముగా వశిత్వమ్ముగా నీలోని అష్టసిద్ధులూ నీకు కన్పట్టగా
సస్వరూపమే విశ్వరూపమ్ముగా
నరుని లోపల పరునిపై దృష్టి బరుపగా తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే
నీ ఆర్తిని కడతేర్చు ఆచార్యుడవు నీవే
వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం
వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం