సినిమాపేరు : ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే || సంగీత దర్శకుడు : యువన్ శంకర్ రాజా || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు :ఎస్.పి.బాలసుబ్రమణ్యం
పల్లవి :
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా
గుండెల్లో కొలువుండగా
భూమి కనలేదు ఇన్నాళ్ళుగా
ఈమెలా వున్న ఏ పోలిక
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా
గుండెల్లో కొలువుండగా
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
చరణం 1
కన్యాదానంగా ఈ సంపద
చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
పొందాలనుకున్నా పొందే వీలుందా
అందరికి అందనిదీ సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత
పచ్చగ పెంచిన పూవులతో
నిత్యం విరిసే నందనమవగా
అందానికే అందమనిపించగా
దిగి వచ్చెనో ఏమో దివి కానుక
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా
గుండెల్లో కొలువుండగా
చరణం 2
తన వయ్యారంతో ఈ చిన్నది
లాగిందో ఎందరిని నిలబడనీక
ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ నది
తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుక
తొలి పరిచయమొక తీయని కలగా
నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా
చెలి జీవితం వెలిగించగా
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా